"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, April 06, 2006

కొప్పరపు సోదరకవుల కవితా వైభవం

వక్రాల గంగారావు

'ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభ

యత్నంబు ము

న్నేలేదించుక ప్రాసకేని యతికేనిన్‌ గొంకు

కన్పట్ట దే

ఆలస్యంబును కల్గబోదు భళిరా! యయ్యారె!

యివ్వారికిన్‌

పాలే¸°గద! ఆశుధార కవితా ప్రారంభ

నిర్వాహముల్‌'

అంటూ తిరుపతి వేంకట కవుల శిష్యుడైన వేటూరి ప్రభాకర శాస్త్రి చేత మన్ననలందుకొన్న కొప్పరపు సోదర కవులు గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కొప్పరపు గ్రామ నివాసులు. వేంకట సుబ్బరాయ (12.11.1885 జననం, 29.3.1932 మరణం), వేంకట రమణయ్య (30.12.1887 జననం, 21.3.1942 మరణం)లు కొప్పరపు కవులుగా సుప్రసిద్ధులని జగద్విదితమే. ఆశు కవితలోను, అవధాన విద్యలోనూ ప్రావీణ్యం సంపాదించుకొని ఆంధ్ర దేశమంతటా అవధానాలు చేసి అవధాన విద్యకు ప్రాశస్త్యం కల్పించారు.

'రామడుగు రామకృష్ణుడు

ధీమణినిక సంస్మరింతు దేశికవర్యున్‌

ధీమహితు పోతరాట్కుల

రామ కవిన్‌ దలతు సుగురు రత్నము ననఘున్‌'

అంటూ విద్య నేర్పిన గురువులైన బ్రహ్మశ్రీ రామకృష్ణశాస్త్రి గారిని, బ్రహ్మశ్రీ పోతరాజు రామకవి గారిని ప్రస్తుతించారు.

'తనకు గల యట్టి శిష్య బృందమ్ములోన

అగ్రణిగ నన్ను నెవ్వడనుగ్రహించె

అభినుతించెద నట్టి విద్యాఫణీంద్రు

రమ్యగుణసాంద్రు పోతరాడ్రమ చంద్రు'

అంటూ గురువుగారైన రామకవి గారితో సోదర కవులు తమకు గల వాత్సల్యాన్ని ప్రకటించారు. కొప్పరపు సోదర కవులు వివిధ ప్రాంతాలలో అవధానాలు చేస్తూ సాహితీ ప్రియులను మెప్పిస్తూ, వారి చేత గౌరవాలు, సన్మానాలు పొందారు. వీరు పొందిన సత్కారాలకు జగన్మాతయే కారణమని అమ్మవారిని కొనియాడారు.

'ఏ యంబ బిరుదంబు లిప్పించే తొలుదొల్త

మణికొండ భూపాల మౌళి చేత

ఏ దేవి జయ ఘంటికాదుల నిప్పించె

మదరాసు బుధ శిరోమణుల చేత

ఏ తల్లి వేయి నూరిప్పించె ఘటికాద్వ

యివి పీఠికాపురాధీశు చేత'

అంటున్న పద్యంలో వారు పొందిన సత్కారాలను చెప్పుకున్నారు. ఆ రోజుల్లో వేయినూర్లు పొందడమంటే మామూలు మాట కాదు కదా! ఆ గౌరవం కొప్పరపు వారికే దక్కింది.

'విక్రమార్కుని చేత విబుధాగ్ర సరుల కా

లయమైన యట్టి ఉజ్జయిని యనగ

భోజ భూపతి చేత బుధ రత్నముల కాక

రంబైన ధారా పురంబనగ

అల కృష్ణదేవరాయల చేత కవులకు

మందిరంబగు ఆనెగొంది యనగ...'

అంటూ కుండినపురమను నామాంతరం గల తమ సొంత జిల్లాయైన గుంటూరును వర్ణించిన తీరు వారికి తమ జిల్లాపై గల మక్కువను తెలియజేస్తుంది. శతావధానాలు, అష్టావధానాలు, ఆశు కవితా ప్రదర్శనలు చేస్తూ మదరాసు నగరం నందు పండితుల సమక్షంలో అవధానాలు చేసి వారితో సన్మానాలు పొందారు. ఆనాటి సభలకు వచ్చిన కొందరు పండితులు వీరి కవితా వైభవానికి ముగ్ధులై కొప్పరపు సోదర కవులను ప్రశంసిస్తూ పద్యాలు చెప్పారు.

'అంగ! వాం వచన భంగమాలనో

స్సూరి సంసది కుతః పరాజయః

సుబ్బరాయ రమణౌ మహాకవీ

వేంకటోహి యువయోర్ద్వయోః పురః,

ధోరణ నిర్జరాంబువని తోపగ గంటకు

మూడు మార్ల సా

ధారణ వేగయుక్తి బుధ తండము మెచ్చగా పల్కి

పద్యముల్‌

ధారణ తప్పకుండ నవధాన శతంబు ఘటింప

జాలునో

సూరి వరేణ్యులారా! మిము జూడ మహాద్భుత

మయ్యె నాత్మలోన్‌'

అంటూ కావ్యకంఠ గణపతి మహాముని, వావిల కొలను సుబ్బారావు గార్లు కొప్పరపు కవుల కవితా వైభవాన్ని పొగిడినారు.

'అయ్యా కొప్పరపుం గవీశ్వరులు! మీ ఆస్యంబు

మేమెన్నడే

నొయ్యం జూడగ లేదు, శిష్యుడొకడోహో! యంచు

మెచ్చెన్‌ మిమున్‌

వెయ్యూర్లియ్యగ శక్తి లేదు కొనుడీ! వెయ్యారులే

యంచు మే

మియ్యంబూనిన పద్యముల్‌ యనుడి!

మీరెచ్చో నిరాఘాటులై'

అంటూ వేటూరి ప్రభాకర శాస్త్రి ద్వారా కొప్పరపు కవుల అవధాన వైభవాన్ని తెలుసుకున్న తిరుపతి వేంకట కవులు వారికి లేఖ రాస్తూ అభినందించారు. అత్యంతాశ్చర్యకరమైన శతావధానములో, ఆశు కవితలో ఆరితేరిన తిరుపతి వేంకట కవులచే ప్రశంస లేఖ నందుకున్న కొప్పరపు కవులు అమితానంద భరితులై

'తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వరులార!

మహేశ్వరీ కృపా

భర పరిలబ్ధ భవ్య మతి వల్లభ తానంత

సర్వసత్కవీ

శ్వర ధరణీశ్వరార్చిత సద్రసవ త్పద పద్య

మండ నా

దరణ గుణ ప్రభూత కవితా వనితా మహితాను

రాగసుం

దర తర మూర్తులార!...'

అంటూ వేంకట కవులకు కృతజ్ఞతతో ప్రత్యుత్తరం రాశారు.

వివిధ ప్రాంతాలలో అవధానాలు చేస్తూ హైదరాబాద్‌ నగరంలో అవధానం చేసిన కొప్పరపు కవులు ఈ ప్రాంతాన్ని పావనం చేశారు. వారి అవధానం చేసి నూరేళ్ళు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతి ప్రాంగణంలో డిసెంబర్‌ 2005 రెండవ పక్షంలో 'అవధాన సప్తాహం' నిర్వహించి కొప్పరపు కవులకు నీరాజనం ప్రకటించారు. తెలుగు జాతి వైభవాన్ని, తెలుగుపద్య ఖ్యాతిని ఒక వెలుగు వెలిగించిన అవధాన విద్యను మర్చిపోకుండా అష్టావధాన కార్యక్రమాలను నిర్వహించిన పెద్దలకు, అవధాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాహితీ ప్రియులందరికీ కృతజ్ఞతలు. కొప్పరపు కవుల కవితా వైభవ ప్రాశస్త్యాన్ని, వారి జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసిన ప్రసాదరాయ కులపతి వాక్కులు అక్షరసత్యాలు. 29న వేంకట సుబ్బరాయ కవి వర్థంతిని పురస్కరించుకుని కొప్పరపు సోదర కవుల కమనీయ కవితా వైభవాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అదే మనం వారికిచ్చే నిజమైన నివాళి.

Courtesy: ఆంధ్ర ప్రభ


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home