"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, August 22, 2006

తమిళనాట తెలుగు మాట

తమెంతో ఘనం..నేడేదీ ఆ వైభవం?
'తెలుగుదేశంలో ఎవరిని కదిపినా తమిళం పలకదు కానీ తమిళనాట ఏ రెండో వ్యక్తిని పలకరించినా
రెండు తెలుగు మాటలైనా వినిపిస్తాయి. అలాంటి రాష్ట్రంలో... ఈనాటికి తెలుగుభాషకు కాని రోజులు
రావడం ఏమిటి! అసలు, తమిళ-తెలుగు బాంధవ్యం ఈనాటిదా? ఆ రోజుల్లో...' అంటూ నాటి వైభవాన్ని గుర్తుచేసుకుంటున్నారు

గొల్లపూడి మారుతీరావు.

న్నెప్పుడూ ఒక పరిణామం బాధపెడుతూంటుంది. మధ్యధరా సంస్కృతికి తూర్పున ఉన్న దేశాలలో మానవ సంస్కృతీ వికాసానికి ఈనాటికీ అద్దంపట్టే వెుహంజొదారో, హరప్పా శిధిలాలు పాకిస్థాన్‌ పాలుకావటం. అలాగే సాంస్కృతిక వైభవాన్ని చాటే 'తక్షశిల' ఆ దేశంలో భాగంకావడం.

అంత ప్రమాదం కాదుకానీ... అలనాటి సంయుక్త రాష్ట్రంలో 'తెలుగు' వైభవాన్ని తలుచుకొన్నప్పుడు- దక్షిణాదిన- ఇప్పుడు తమిళదేశంగా ఉన్న చాలా ప్రాంతాలలో ఎందరో మహానుభావులు ఆ రోజుల్లో ఎంత గొప్ప కృషి చేశారా అని గర్వపడాలనీ ఇప్పుడా అవకాశం కొరబోయిందని బాధపడాలనీ...అనిపిస్తుంది.

తెలుగుభాషా వికాసాన్ని తలుచుకొన్నప్పుడు తిరువారూరు, కాంచిపురం, తంజావూరు, మద్రాసు పట్టణాల్ని మరచిపోలేం. మరచిపోయే వీలులేదు. ఈమధ్యనే ఈ స్థలాలన్నిటికీ నేను వెళ్ళి చూసి పరవశించాను. తిరువారూరులో అద్భుతమైన త్యాగరాజస్వామి ఆలయానికి కాస్త అటూ ఇటుగా- దాదాపు ఒకే సమయంలో ముగ్గురు వాగ్గేయకారులు జన్మించి తెలుగు వాగ్గేయ సంపదని పరిపుష్టం చేశారు. సృష్టిలో ఇదెంత అద్భుతం! సంగీత ప్రపంచంలో చరిత్రను సృష్టించే ముగ్గురు మహానుభావులు ఒకే తరంలో, ఒకే వూరిలో- ఒక ఫర్లాంగు దూరంలో చిన్నచిన్న బడుగు ఇళ్ళలో జన్మించారు. ఎవరికి ఎవరూ తీసిపోని అద్భుతమైన కృషి చేశారు.

శ్యామాశాస్త్రి రచన చేస్తూండగా చెల్లెలు రోజూ ఆయనకి భోజనం తెచ్చేదట.ఒకరోజు అమ్మవారి (ఆయన జీవితమంతా అమ్మవారిమీదే రచనలు చేశారు.శ్రీ బంగారుదేవీ కామాక్షీ ఉపాసకులు) నగలన్నీ వేసుకొని చెల్లెలు భోజనం తెచ్చిందట.శ్యామాశాస్త్రి నివ్వెరపోయారు. తీరా ఆమె వెళ్ళాక ఆయన చెల్లెలు ఈసారి నిజంగానే వచ్చింది.శ్యామాశాస్త్రి ముందు వచ్చింది అమ్మవారేనని గుర్తించారు.పరవశించిపోయారు.అందుకే ఆయన కీర్తనలలో ముద్ర 'శ్యామకృష్ణ సోదరీ' అని ఉంటుంది.ఆ సందర్భంలో ఆనందభైరవిలో అద్భుతమైన కీర్తన చేశారంటారు. ఆ కీర్తన తర్వాత 'ఆనందభైరవి'లో మరే కీర్తనా చెయ్యనవసరంలేదని త్యాగరాజు భావించాడని అంటారు.

ముత్తుస్వామి దీక్షితులు శ్రీవిద్యోపాసకులు. వారి అంతిమ యాత్ర గురించి ఓ విచిత్రమైన సంఘటన వారి ఔన్నత్యాన్ని చెప్పకచెప్తుంది. 1835 నరకచతుర్దశినాడు మామూలుగా లేచి అనుష్టానం చేసుకోబోతూండగా- యెుట్టయాపురం మహారాజు భయాందోళనలతో వచ్చి 'గాంగేయుడనే భద్రగజం పిచ్చిదై గజశాల నుండి గొలుసులు తెంచుకొని శ్మశానవాటికవైపు పరిగెత్తుతోం'దని చెప్పారట.సప్తస్వరాలలో నిషాదం ఏనుగు ఘీంకారానికి సంకేతం.షట్చక్రములలో ఏడవ చక్రము సహస్రారము.మహాత్ముడైన సిద్ధుడు సహస్రారమును ఛేదించుకొని వెడలు సమయం వచ్చిందన్న సూచనని గ్రహించి- శిష్యులను 'మీనాక్షి మేముదం దేహి' అనే కీర్తన (గమనక్రియ) పాడమన్నారట.'మీనలోచని, పాశవోచని' అంటున్నప్పుడు వారి కళ్ళు ధారాపాతంగా వర్షించాయట. కపాలవోక్షంతో తనువును చాలించారు.

సంగీతాన్ని గురించి రాయడానికి నాకు అర్హత చాలదు. తెలుగుభాషని సుసంపన్నం చేసిన ముగ్గురు వాగ్గేయకారుల్ని ఉటంకించడం నా ఉద్దేశం. ఈ త్రిమూర్తులు కేవలం రచయితలుకారు.ఉపాసకులు.తమ రచనల్ని 160 సంవత్సరాలు బతికించుకొని లక్షలాదిమంది నోళ్ళలో ప్రతిక్షణం మననమయే మహద్భాగ్యం అందరికీ అన్ని రచనలకీ దక్కదు. ఈనాటి తమిళనాడుని తెలుగు వైపు వెుగ్గించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

తెలుగు వైభవం
స్థాళీపులాక న్యాయంగా చెప్పుకున్నా తంజావూరు రాజుల సాహితీసేవ, ఒక్క 'ముద్దుపళని' చాలు- ఆనాటి తెలుగు సౌరభాన్ని రుచిచూపడానికి. ఇప్పటికీ సరస్వతీ గ్రంథాలయంలో విలువ కట్టలేని ఎన్నో తెలుగు కావ్యాల, ప్రబంధాల, శాసనాల తాళపత్ర గ్రంథాలున్నాయి. ఇప్పటికీ తంజావూరు సాహితీ జిజ్ఞాసువులకూ పరిశోధకులకూ యాత్రాస్థలం.

తెలుగుదేశంలో ఎవరిని కదిపినా తమిళం పలకదుకానీ తమిళదేశంలో ఏ రెండో వ్యక్తిని పలకరించినా రెండు 'తెలుంగు' మాటలయినా వినిపిస్తాయి. కారణం- త్యాగరాజస్వామి, శ్యామాశాస్త్రి వాళ్ళ పెరట్లో ఉన్నారు. ఇప్పుడు ద్రవిడ ఉద్యమం వారిని, ఆ వైభవానికి దూరంచేస్తున్నా- ఇప్పటికీ తెలుగు వారి నాలుకలమీద 'తప్పు'గానయినా పలుకుతుంది.

తెలుగుదేశంలో ఒకనాటి రాజమహేంద్రవరం, బందరు వంటి పట్టణాలకు చెప్పుకునే వైభవం నిన్నటి వెున్నటిదాకా మద్రాసులో వెలిగింది. 1878లో ఈనాటి 'హిందూ' పత్రికా స్థాపకులలో ఒకరు- సుబ్బారావు అనే తెలుగాయన. ఈమధ్య ఏదో సందర్భంలో తమ చరిత్రని ఉటంకిస్తూ- 'హిందూ'లోనే ఈ విషయాన్ని పేర్కొన్నారు. పత్రికా రచనకూ పత్రికా వ్యవస్థకూ ఆద్యులు తెలుగువారని గర్వపడటానికి ఇది కేవలం ప్రారంభం. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి ఆంధ్రపత్రిక, భారతి- ఇది పత్రికా ఉద్యమంకాదు...అదొక సాహితీ ఉద్యమం. తెలుగుభాషకి గంభీరమైన స్థానాన్ని కల్పించి దినపత్రిక రుచినీ అంతకుమించి దేశభక్తినీ జాతికి రంగరించి పోసిన ఉద్యమకారులు పంతులుగారు. ఆయన డబ్బుకోసం పత్రిక నడపలేదు. పత్రిక కోసం డబ్బు వెచ్చించారు. డబ్బే కావలసివస్తే ఆయనకి ఒక్క 'అమృతాంజనం' చాలు. సాహితీపరులకీ ఆపన్నులకీ ఆయన చేసిన గుప్తదానాలకు లెక్కలేదు.

ఎందరో మహానుభావులు
వావిళ్ళవారి తెలుగు నిఘంటువు 1920 తరవాత వెలువడింది. ఇది తెలుగుభాషకు అనితరసాధ్యమైన ఉపాయనం. అంతకుముందే బహుజనపల్లి సీతారామయ్య గారి శబ్దరత్నాకరం వెలువడింది (1821లో ఎ.డి.కాంప్‌బెల్‌, 1852లో సి.పి.బ్రౌన్‌ రెండు నిఘంటువులను వెలువరించారు. తెలుగుభాషకు తెలుగువారే చేసుకోలేని సేవని ఆనాడే ఇద్దరు ఆంగ్లేయులు చేశారు). తరవాతదే మహంకాళి సుబ్బయ్యగారి శబ్దార్థచంద్రిక.

చెన్నపట్నం బజారు భాషని సులభ గ్రాంథికంగాచేసి సాహితీపరులకు పంచిన ఒజ్జ వావిళ్ళ రామస్వామిశాస్త్రిగారన్నారు- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తన 'అనుభవాలూ- జ్ఞాపకాలూ'లో. మరొకపక్క మునగాల రాజావారు వారికి తోచినట్టు తెనుగుకి వెన్నునిచ్చారు.

నాటకరంగంలో- ఆధునిక నాటకరంగ చరిత్ర మద్రాసులోనే ప్రారంభమైందని చెప్పాలి. కిందటి శతాబ్దపు రెండవ దశకంలో పాకాల వేంకట రాజమన్నారు గారి 'తప్పెవరిది?' నాటకాన్ని బళ్ళారి రాఘవ, కొమ్మూరి పద్మావతీదేవి గారలు- ఈనాటికీ ఉన్న మ్యూజియం ధియేటర్‌లో ప్రదర్శించారు.

ఇంకాస్త ఇటీవలి కాలానికి జరిగితే- 1938నాటికి స్వాతంత్య్ర సమరయోధుడు, జిజ్ఞాసి, సాహితీపిపాసి, సంఘసేవకుడు- పందిరి మల్లికార్జునరావు గారు సకుటుంబంగా మద్రాసు చేరారు. వారి ఇంటి నంబరు- 16 జోన్స్‌ స్ట్రీట్‌, మన్నడి, మద్రాసు-1 - ఆ రోజుల్లో సాహితీ నిలయం.గోరాశాస్త్రి, భాస్కరభట్ల కృష్ణారావు, యండమూరి సత్యనారాయణ (శ్రీవాత్సవ), జనమంచి రామకృష్ణ, పిలకా నరసింహమూర్తి, పిలకా గణపతిశాస్త్రి ప్రభృతులు తరచూ ఇక్కడ సమావేశమయ్యేవారు.1948లో మల్లికార్జునరావు గారు స్థాపించిన 'కిన్నెర' ఏడు సంవత్సరాలు సాగింది. విశ్వనాథ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొంపల్లె జనార్దనరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి ఉద్ధండుల రచనలతో అత్యంత గంభీరంగా నడిచింది. నేను యూనివర్సిటీలో చదువుకొనే రోజుల్లో(1956-59) అయ్యంకి వెంకట రమణయ్య గారి 'ఆంధ్రభారతి', కౌతా శ్రీరామశాస్త్రి గారి 'శారద', శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి 'ప్రబుద్ధాంద్ర' లెక్కలు ఆనర్స్‌ చదివే నన్ను చెడగొట్టి, దారిమళ్ళించి సాహిత్యంవైపు తోవపట్టించాయి. ఆనాటి యూనివర్సిటీ లైబ్రేరియన్‌ అబ్బూరి రామకృష్ణారావు గారు ఆ తరానికి చేసిన గొప్ప ఉపకారం ఈ సంచికల బైండ్లను గ్రంథాలయంలో ఉంచడం.

ఆ రోజుల్లోనే ఖాసా సుబ్బారావు గారి సంపాదకత్వంతో 'స్వతంత్ర' వారపత్రిక వచ్చేది.తాపీ ధర్మారావు, విద్వాన్‌ విశ్వం గార్ల సంపాదకత్వంతో మల్లికార్జునరావు గారు 'ఇంటింటి విజ్ఞానమాల'ను ప్రారంభించారు. రెండు సంపుటాలే వెలువడ్డాయి. ఆ రోజుల్లో మల్లికార్జునరావు గారి 'కిన్నెర అకాడమీ'లో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు వంటి సాహితీ ప్రముఖులు పాల్గొనేవారు.

తెలుగుభాషా సమితి సాంస్కృతికశాఖ తెలుగు సాహిత్యానికి ఉత్తమమైన సేవలు చేసింది.తొలి ఉపన్యాసం మద్రాసు గవర్నమెంటు కాలేజీలో మహా మేధావీ నిరాడంబరుడూ అయిన శ్రీ నేలటూరు వెంకటరమణయ్య గారు ఇచ్చారు.ఇక్కడినుంచే తెలుగుభాషా సమితి విజ్ఞాన సర్వస్వం ప్రచురణకి ప్రారంభం జరిగింది. ఈ పనిలో నేలటూరివారూ తాపీ ధర్మారావు నాయుడుగారూ వోటూరి సత్యనారాయణరావుగారూ ఉన్నారు.

ఇది ఒక దశ.నాకు తెలిసిన దశ 1972 నాటిది. అప్పటికి నేను 'ఆకాశవాణి'లో తెలుగు విభాగంలో పనిచేయడానికి శంబల్పూరు నుంచి వచ్చాను. ఆ రోజుల్లో అయిదు కేంద్రాల నుంచి తెలుగు కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. మద్రాసు తమిళులది. తెలుగు కార్యక్రమాలు తక్కువ. అయినా రాశిలోకాక వాశిలో తెలుగు దేశాన్ని వూపి ఉర్రూతలూగించే కార్యక్రమాలు మా సొత్తయ్యేవి.కారణం- తెలుగుతేజం ఆనాడు సినిమా కారణంగా అయినా, పాత సంప్రదాయపు కారణానికయినా మద్రాసులోనే ఇంకా ఇంకా ప్రకాశించడం.

భువనవిజయం
నాకంటే ముందు దాశరథిగారు, గుర్రం జాషువాగారు, ఆచంట జానకీరాంగారు, ఆమంచర్ల గోపాలరావుగారు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు- వంటి ఉద్ధండులు ఇక్కడ ఉండేవారు. నా రోజుల్లోనే శ్రీశ్రీ, ఆరుద్ర, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, అనిశెట్టి సుబ్బారావు, పినిశెట్టి శ్రీరామమూర్తి, పాలగుమ్మి పద్మరాజు, మాగోఖలే, పాకాల వేంకట రాజమన్నారు, మాలతీ చందూర్‌, ఎన్నార్‌ చందూర్‌, కె.రామలక్ష్మి, ముళ్ళపూడి, మద్దిపట్ల సూరి వంటి రచయితలు, బులుసు వెంకటరమణయ్య, వేదం వెంకటరాయశాస్త్రి(వేదం వారి మనవలు), నిడదవోలు వెంకటరావు, రావూరి దొరస్వామి శర్మ, చిన్నికృష్ణయ్య, చల్లా రాధాకృష్ణ శర్మ, పిలకా గణపతిశాస్త్రి, వి.ఎ.కె.రంగారావు వంటి పండితులు ఉండేవారు. ఆనాటి మద్రాసు నగరం ఒక భువన విజయం.

ఇక సినిమా వైభవం- అదొక చరిత్ర. ఎల్‌.వి.ప్రసాద్‌- ఇటు చిత్రకళకి, అటు దర్శకత్వానికి కొత్త విలువల్ని సంతరించిన బాపూ, ఒకనాటి కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ప్రత్యగాత్మ, టి.ప్రకాశరావు, వి.మధుసూదనరావు, విఠలాచార్య, భావనారాయణ, కె.విశ్వనాథ్‌- ఇలా చెప్పుకుంటూపోతే పేజీలు చాలవు.
ఇక కళాదర్శకులు కె.వి.ఎస్‌.శర్మ, శేఖర్‌, తోట(ఇప్పటి పద్మశ్రీ తోట తరణి తండ్రిగారు), కళాధర్‌ (ఇప్పుడాయన వయసు 91 సంవత్సరాలు)- సినిమాలకి కొత్తదనాన్నీ నిర్మాతలకు కొత్త ధనాన్నీ సంపాదించిపెట్టారు.
రచయితలు- సముద్రాల రాఘవాచార్యులు, తాపీ ధర్మారావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, వేటూరి సుందరరామమూర్తి, దాశరథి- వీరంతా సినిమాకి షోకులు దిద్దలేదు. వెండితెరని బంగారు కలగా మలిచారు. మద్రాసులో ఏ చిన్న సాహితీ సభ జరిగినా తెలుగుదనం పొంగిపొర్లేది. ఇక ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సుసర్ల దక్షిణామూర్తి, ఎస్‌.రాజేశ్వరరావు, బేబీ గాయత్రి, వీణ చిట్టిబాబు, పి.బి.శ్రీనివాస్‌, పి.సుశీల, ఎస్‌.జానకి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం- ఇలా గాన కళకు పట్టంకట్టిన పద్మవిభూషణ్‌లు కొలువుతీర్చిన నగరం మద్రాసు.
ఇక నటులు- ఆనాడు అక్కినేని, ఎన్టీఆర్‌, రేలంగి, జగ్గయ్య, ఎస్వీ రంగారావు, సావిత్రి- తెలుగు ధనమంతా ఆనాడు మద్రాసులోనే ఉండేది.

ఎన్టీఆర్‌ తెలుసా?
అమెరికా వీసాకి నేను వెళ్ళినప్పుడు సినీనటుడినని చెప్తే ''ఎన్టీ రామారావు తెలుసా?'' అని అడిగాడు ఒక అమెరికన్‌ దొర. ఆయనతో నా ఫొటోని చూసి తృప్తిగా నాకు పదేళ్ళ వీసా ఇచ్చాడు. తెలుగుకేతనాన్ని అంతర్జాతీయంగా ఎగురవేసిన యోధుడు ఎన్టీఆర్‌. ఇక రెండు భాషలలోనూ తమ ప్రాచుర్యాన్ని నిలుపుకొన్న భానుమతి, ఎస్వీ రంగారావు, కన్నాంబ వంటివారు సరేసరి. స్టూడియో యజమానిగా, నటిగా, గాయకురాలిగా తన ప్రతిభను దక్షిణాదినంతా పండించుకొన్న పద్మభూషణ్‌- పాలువాయి భానుమతి. ఆసియా ఖండంలోకల్లా గొప్ప పెద్ద స్టూడియో- విజయా. యజమాని- బి.నాగిరెడ్డి గారు. మరొక ప్రముఖ స్టూడియో యజమాని- ఎల్‌.వి.ప్రసాద్‌ గారు.సంయుక్త మద్రాసుకు గవర్నరుగా పనిచేసిన వెుదటి భారతీయుడు- సర్‌ కె.వి.రెడ్డి నాయుడు.ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు చేసిన కూర్మా వేణుగోపాలస్వామి తండ్రిగారు. ప్రస్తుతం బోగ్‌రోడ్డులో ఉన్న నడిగర్‌ తిలకం శివాజీ గణేశన్‌ ఇల్లు వారిది. నిజానికి అది ఇల్లు కాదు- ఒక ప్యాలెస్‌.
ఒక్క సినిమా వైభవమే ఒక సమగ్రమైన పరిశోధనకు సరిపోయే విషయం.

పిల్లల కోసం...
పసివారికి ఒక వేదికనీ ఒక పత్రికనీ నెలకొల్పిన చరితార్థులు న్యాపతి రాఘవరావు, కామేశ్వరిగారలు. వారికి సంతానం లేదు.తమ కార్యక్రమాల్లో పిల్లలందరినీ తమ బిడ్డల్ని చేసుకొని రేడియోలో వారంవారం నడిపిన పిల్లల కార్యక్రమంతో తెలుగుదేశమంతా వారి సంతానమయిపోయింది. అదొక ఉద్యమం. బాపూ, ముళ్ళపూడి, కందా వోహన్‌ వంటి ఎందరో మాన్యులు ఆ స్ఫూర్తితో తమ జీవితాల్ని మలచుకొన్నారు.అన్నయ్యగారు నడిపిన 'బాల' బాపూ చిత్రాలతో, రమణగారి కథలతో ఆనాటి ప్రతి బాలుడి శైశవాన్నీ అలంకరించింది.

అలాగే 14 భాషలలో పిల్లలను ప్రభావితంచేసిన మరో పత్రిక- కాదు- మరో ఉద్యమం- 'చందమామ'.దీనికి మూలపురుషుడు చక్రపాణి గారు. కొడవటిగంటి ఈ సంస్థకు మూలవిరాట్టు. ఆ రోజుల్లో వడపళనిలో చందమామ బిల్డింగ్స్‌, విజయా వాహినీ స్టూడియోలు నాలాంటి కళాప్రియులకు యాత్రా స్థలాలు.చక్రపాణి గారు 'యువ' పబ్లికేషన్స్‌ పేరిట ప్రచురణ సంస్థని ప్రారంభించి, శరత్‌ సాహిత్యాన్ని అనువదించి, ప్రచురించి తెలుగుజాతికి గొప్ప ఉపకారం చేశారు.తర్వాత వెలువడిన 'యువ' మాసపత్రిక వారి మానస పుత్రిక.

సామాజిక రంగంలో దుర్గాబాయమ్మ గారు, చెన్నగంటమ్మ గారు మద్రాసులో చేసిన కృషి అవోఘమైంది.మహిళలకు ఉపాధి, ఉద్యోగంచేసే స్త్రీలకు హాస్టలు, పసిపిల్లలకు, పెద్దలకు వైద్య సదుపాయాలు, స్కూళ్ళు, వృద్ధులకు హాస్టలు- ఇన్ని చేశారు.

ఇక వ్యాపారస్తులు- ఇప్పటికీ మద్రాసులో వీరిదే పైచెయ్యి. ఉమ్మడి, నల్లి, ఈగావారు వైశ్యులు.మద్రాసు చుట్టూ ఎన్నో సత్రాలు కట్టించారు. వదాన్యులు. సూరావారి సత్రం, కనకమ్మ సత్రం, సుంకువారి సత్రం- ఇప్పటికీ నామావశిష్టాలు.వీరి ఇళ్ళలో ఇప్పటికీ తెలుగే మాట్లాడుకొంటారు. ఇటీవలి తరాలకి తెలుగు వినికిడేగానీ పరిచయం తక్కువ.అంతెందుకు...మద్రాసు కార్పొరేషన్‌ భవనం ముందు నిలువెత్తు జ్ఞాపకంగా ఒకప్పటి నగరపాలక సంస్థ అధ్యక్షుల విగ్రహం- పిట్టి త్యాగరాయ చెట్టిది.ఆ రోజుల్లో 'చెట్టి' అని పిలవడం గొప్పగా గౌరవించడంకింద లెక్క(చెట్టి అన్న పదం 'శ్రేష్టి' అన్న పదానికి వికృతరూపం). నిజానికి ఆయన దేవాంగులు.

ఇప్పటి నల్లి కుప్పుసామి చెట్టి సంగీతానికి ఎనలేని సేవలు అందించారు... అందిస్తున్నారు. ఆ ఒక్క కారణానికే పద్మశ్రీ అయ్యారు. మరొక దాత, పారిశ్రామికవేత్త ఓబుల్‌రెడ్డి గారు. మరి వైద్యరంగానికి కార్పొరేట్‌ స్థాయిని జాతీయంగా, అంతర్జాతీయంగా కల్పించిన ఘనత ప్రతాప్‌ సి.రెడ్డి గారిది. వీరిది చిత్తూరు జిల్లా దిగువమాఘం.

ఇలా తీగె కదపాలేగానీ వూహించని ఎన్నో డొంకలు కదులుతాయి.జాబితాలను ఉటంకించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. ఎటుచూసినా ఆంధ్రత్వం ఉట్టిపడే ఈ నగరంలో నేను 35 సంవత్సరాలుగా ఉంటున్నాను. భాషాప్రయుక్త రాష్ట్రాల కారణంగా అయితేనేం, ద్రవిడ ఉద్యమాల కారణంగా అయితేనేం, పామర జనాన్ని మెప్పించడానికి స్వభాషా వ్యావోహాన్ని కల్పించే రాజకీయ నాయకుల చర్యలవల్లనయితేనేం- క్రమక్రమంగా తెలుగుదనం మృగ్యమవుతోంది.

చలనచిత్రసీమ హైదరాబాదుకి తరలడంతో ఎందరో తెలుగు ప్రముఖులు ఆంధ్రదేశానికి తరలిపోయారు. ఎంత గొప్ప గుబాళింపు అయినా కాలం దాన్ని మింగేస్తుంది.పరిపుష్టం చేయని నేపథ్యంలో వికసనం వెనుకంజ వేస్తుంది.ఇవాళ మద్రాసు ఇంగువ కట్టిన గుడ్డ.ప్రతీ సాయంకాలం ఓ త్యాగయ్య, ఓ శ్యామాశాస్త్రి, ఓ రామదాసు- అక్కడా అక్కడా మెరిసి మిరుమిట్లుగొలిపినా- మిగతా ఆకాశమంతా చికటి.

ఈనాటి తరానికి లజ్‌లో శ్రీభాగ్‌ తెలీదు.హైకోర్టు నడిరోడ్డుమీద బ్రిటిష్‌వారి తుపాకులకు రొమ్మిచ్చి నిలిచిన ఆంధ్రకేసరి దేశభక్తి తెలీదు. మైలాపూర్‌లో ఓ మూల ఉన్న పొట్టి శ్రీరాములు వంటి అమరత్యాగి లేపిన ఉద్యమజ్వాలలు తెలీవు.ఇప్పుడు కాలి మసి అయిపోయిన మూర్‌ మార్కెట్‌ వెనుక గుంభనంగా దాగొన్న చెన్నపురి ఆంధ్ర మహాసభ బంగారు గతం తెలీదు.ఆసుపత్రులూ హోటళ్ళూ బ్యాంకులూ షాపులూ ముసురుకొన్న ఆవరణ వెనుక 'చందమామ' వెన్నెలలు తెలీవు.వాహినీ-విజయా సంస్థల ఉజ్జ్వల చరిత్ర తెలీదు.పానగల్‌ పార్కులో తప్పుచేసినవాడిలాగా ఓ మూల నిలుచున్న చిత్తూరు నాగయ్యగారి ఘనకీర్తి తెలీదు.ఆ తెలుగు నటుడి వెుదటి పద్మశ్రీ గురించి తెలీదు. సంగీతప్రియులకు కానుకగా తన డబ్బుతో ఓ సభని నిర్మించి సర్‌ సి.పి.రామస్వామి అయ్యర్‌ 'నీ పేరు పెట్టుకో నాగయ్యా' అన్నా వినకుండా 'వాణి'ని చిరస్మరణీయం చేసిన 'వాణీమహల్‌' కథ తెలీదు (ఇప్పుడది త్యాగబ్రహ్మ సభ అయి కూర్చుంది).ఈ వీధులలోనే తిరుగాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తెలీదు.ఈ గాలులనే తన మాధుర్యంతో మత్తెక్కించిన ఘంటసాల తెలీదు. అంతెందుకు...తెలుగు తెలీదు.పరభాషని నేర్చుకోవడం పరమ నేరమనే ప్రాంతీయ దురభిమానం కూడదని చెప్పే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌, వీణ కుప్పయ్యర్‌, కోటేశ్వరయ్యర్‌లు తమిళనాడులో ఇప్పుడు లేరు.

ఏ రాష్ట్రంలో ఆ భాష నేర్పడం, నేర్వాలనడం సబబే.కాదనే హక్కు ఎవరికీ లేదు.కాకపోతే, ఆ భాష పక్కనే ఒకప్పుడు ఈ రాష్ట్రమే ఆకాశానికి ఎత్తిన 'తెలుగు'భాషకీ ఒకింత స్థానం కల్పించాలని కోరడం అసమంజసం కాదు.జాతీయస్థాయిలో 'విహంగ వీక్షణం' చేయగల రాజకీయ నీతిజ్ఞులుంటే- తమిళనాడులో అందరూ ఒకప్పుడు- ఈ రాష్ట్ర వైభవాన్ని చాటిన 'తెలుగు'ను 'కూడా' నేర్వాలంటే- తెలుగుదేశం కృతజ్ఞతతో ఆరాధనాభావంతో వారికి నివాళులర్పించేది.

అయితే రోజులు మారిపోతున్నాయి.నాయకత్వం కులాల చుట్టూ భాషల చుట్టూ భావాల చుట్టూ ముళ్ళతీగల్ని అల్లుతోంది.అది ఈ దేశం దురదృష్టంగా, తమిళనాడులో 'తెలుగు'భాష దురదృష్టంగా మిగిలిపోకూడదు. మరది సాధ్యమేనా?తమిళులకూ తెలుగువారికీ మధ్య ఉన్న చిరకాల అనుబంధాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుంటే...భాషా దురభిమానాన్నివీడి విశాల దృక్పథంతో యోచిస్తే...ఏవో, ఎందుక్కాదు

Courtesy:ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home